ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిరాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక కార్యదర్శి జమేష్ రంజన్.
అర్జున్ సమాచారం,ఆగస్టు 22, జిల్లా ప్రతినిధి (కొమురం భీమ్)
ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మించడంలో భాగంగా ప్రతి ఒక్కరికి శారీరక, భౌతిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక కార్యదర్శి జమేష్ రంజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని షాప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా నోడల్ అధికారులతో ఫిజికల్ లిటరసిపై జిల్లా స్థాయిలో కార్యక్రమాలు అమలు చేయడంపై వర్చువల్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యజీవితంలో యోగ, క్రీడలు, నడక, వ్యాయామము తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ శారీరక, భౌతిక అక్షరాస్యత కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాస్థాయిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి అనుసంధానంతో ఫిజికల్ లిటరసీ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఫిజికల్ లిటరసీ కార్యక్రమం పై జిల్లా స్థాయిలో ప్రణాళిక కార్యచరణ, సమన్వయం, కార్యక్రమాల అమలు అంశాలను పర్యవేక్షించాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అశ్వక్ అహ్మద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫిజికల్ లిటరసీ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, ఒలంపిక్ అసోసియేషన్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, క్రీడా క్లబ్బుల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి రాందార్ తదితరులు పాల్గొన్నారు.